టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. మరోవైపు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఆయనతో పాటు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమాళవన్ కూడా కేసీఆర్‌ను కలిశారు. ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి తిరుమాళవన్ ప్రగతి భవన్‌కు వచ్చారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలతో సీఎం కేసీఆర్ అల్పాహార విందులో పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభంకానున్నది. సర్వసభ్య సమావేశానికి 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. సమావేశంలో పార్టీ పేరుమార్పుపై తీర్మానం, సంతకాల సేకరణ చేపట్టనున్నారు.