కరోనా మహమ్మారితో అష్టకష్టాలు పడుతున్న వేళ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో జియో ఫోన్ యూజర్లకు రెండు ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో జియో ఫోన్ యూజర్లు రీచార్జి చేసుకోకపోయినా ఫోన్లను వాడుకోవచ్చు.
జియో ఫోన్ యూజర్లు కోవిడ్ సమయంలో తమ ఫోన్లకు రీచార్జి చేయించాల్సిన పనిలేదు. రీచార్జి చేయించకపోయినా జియో ఫోన్లు పనిచేస్తాయి. పైగా నెలకు 300 నిమిషాల ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ లభిస్తాయి. వాటిని రోజుకు 10 నిమిషాల చొప్పున వాడుకోవచ్చు. ఇక రెండో ఆఫర్ కింద.. జియో ఫోన్ యూజర్లు ఏ ప్లాన్‌ను రీచార్జి చేయిస్తే ఆ ప్లాన్‌కు సమానమైన విలువ కలిగిన ప్లాన్‌ను ఉచితంగా పొందుతారు. అంటే.. వారు రూ.75తో రీచార్జి చేసుకుంటే రూ.75 ప్లాన్ ఉచితంగా లభిస్తుందన్నమాట.
కరోనా నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ ఆఫర్లను జియో ఫోన్ వినియోగదారులకు అందిస్తున్నట్లు జియో తెలియజేసింది. ఇప్పటికే ఆ ఫౌండేషన్ దేశంలో కోవిడ్‌పై పోరాటం చేస్తోంది. అందులో భాగంగానే అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ దేశంలోనే మొదటి కోవిడ్ కేర్ హాస్పిటల్‌ను కేవలం 2 వారాల్లోనే ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. అలాగే కోవిడ్ బాధితులకు బెడ్లు, ఇతర వైద్య సదుపాయాలను సైతం అందిస్తోంది. కరోనా కష్టకాలంలో ప్రజలకు తమ వంతుగా సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకనే జియో ఫోన్లను వాడుతున్న వారికి పైన తెలిపిన రెండు ఆఫర్లను అందిస్తున్నామని రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.