టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం నూతనంగా జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు రూ.399 నుంచి రూ.1499 మధ్య లభిస్తున్నాయి. వీటన్నింటిలోనూ పలు సదుపాయాలను కామన్‌గా అందిస్తున్నారు. వీటికి అందించే డేటా మారుతుంది.
రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ లో కస్టమర్లకు 75 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. దీనికి గాను 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ ఫెసిలిటీని అందిస్తున్నారు. అలాగే రూ.599 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. ఇందులో 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ ఫెసిలిటీ ఉంటుంది. 1 అదనపు సిమ్ కార్డును ఫ్యామిలీ ప్లాన్ లో ఇస్తారు. అదే రూ.799 ప్లాన్ అయితే 150 జీబీ ఉచిత డేటా, 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ ఫెసిలిటీ, 2 అదనపు ఫ్యామిలీ కనెక్షన్ సిమ్ కార్డులను ఇస్తారు. ఇక రూ.999 ప్లాన్‌లో 200 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. ఇందులో 500 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ ఫెసిలిటీ ఉంటుంది. 3 అదనపు సిమ్‌లు ఇస్తారు. రూ.1499 ప్లాన్‌లో 300 జీబీ ఉచిత డేటా వస్తుంది. 500 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే అమెరికా, యూఏఈలలో అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ ను వాడుకోవచ్చు.
ఈ ప్లాన్లు అన్నింటిలోనూ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు, హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. వాటి కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. అలాగే జియో యాప్స్ ను ఉచితంగా వాడుకోవచ్చు. జియో టీవీలో 650కి పైగా లైవ్ టీవీ చానల్స్ చూడొచ్చు. వీడియో కంటెంట్ లభిస్తుంది. 5 కోట్లకు పైగా పాటలు, 300కు పైగా న్యూస్ పేపర్లు ఉచితంగా లభిస్తాయి.
ఫ్యామిలీ కనెక్షన్ తీసుకుంటే ఒక కనెక్షన్‌కు రూ.250 చొప్పున చెల్లించవచ్చు. ఇందుకు డేటా రోల్ ఓవర్ ఫెసిలిటీని 500 జీబీ వరకు అందిస్తారు. ఇక భారత్‌లో, విదేశాల్లో ఉచిత వైఫై కాలింగ్ సదుపాయం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే భారతీయులు విమానాల్లో మొట్ట మొదటి సారిగా ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ పొందవచ్చు.
అమెరికా, యూఏఈలలో ఉచిత రోమింగ్ సదుపాయం లభిస్తుంది. ఇంటర్నేషనల్ రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇండియాకు నిమిషానికి రూ.1కే కాల్ చేయవచ్చు. అదే భారత్‌లో ఉన్న వారు అయితే విదేశాలకు నిమిషానికి 50 పైసలకే కాల్ చేయవచ్చు. ఇప్పటికే జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లను వాడుతున్న వారితోపాటు ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లకు మారవచ్చు. పోస్ట్ పెయిడ్ యూజర్లు అయితే సింపుల్‌గా వాట్సాప్ లో తమ మొబైల్ నుంచి 88-501-88-501 అనే నంబర్‌కు hi అని మెసేజ్ పంపితే చాలు. ఇక ప్రీపెయిడ్ కస్టమర్లు Jio.com/postpaid అనే సైట్‌ను సందర్శించవచ్చు. లేదా 1800 88 99 88 99 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. లేదా దగ్గర్లోని జియో స్టోర్‌కు వెళ్లవచ్చు. ఎలా చేసినా పోస్ట్ పెయిడ్ ప్లస్ సిమ్ కార్డును ఇంటికే డెలివరీ చేస్తారు. ఇక ఈ ప్లాన్లు ఈ నెల 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి.