జియో వైఫై కాలింగ్‌ షురూ..

-

మొబైల్‌ నెట్‌వర్క్‌ లేని చోట, సిగ్నల్‌ బలహీనంగా ఉన్నచోట, అక్కడ వైఫై ఉంటే ఈ వైఫై కాలింగ్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌, విడియో కాల్స్‌ చేసుకోవచ్చు.

ప్రముఖ టెలికం కంపెనీ, జియో, వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వైఫై నెట్‌వర్క్‌ ద్వారా వాయిస్‌, విడియో కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని బుధవారం నాడు ప్రవేశపెట్టింది. ముంబయిలో లాంఛనంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సాంకేతికతను ప్రారంభించారు.

గత కొన్ని నెలలుగా ఈ సాంకేతికతపై పరీక్షలు జరుపుతున్న జియో ఎట్టకేలకు అన్ని సమస్యలు అధిగమించి దేశవ్యాప్తంగా వైఫై కాలింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా ముంబయిలో ప్రారంభించబడిన ఈ సేవలు జవనవరి 16లోపు దేశమంతటా విస్తరిస్తాయని తెలిపింది. దాదాపు 150 రకాల స్మార్ట్‌ఫోన్లు ఈ జియో వైఫై కాలింగ్‌ను సపోర్ట్‌ చేస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్‌ కూడా ఈమధ్యనే ఈ సౌలభ్యాన్ని ప్రారంభించినా, దేశవ్యాప్తంగా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫోన్లు కూడా ఆపిల్‌, సామ్‌సంగ్‌ లాంటి కొన్ని ప్రీమియం బ్రాండ్లనే సమర్థిస్తోంది.

ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే, పని చేస్తున్న జియో ప్లాన్‌ ఒకటి ఉంటే చాలు. అదే జియో నంబర్‌పై ఏ వైఫై నెట్‌వర్క్‌నైనా వాడుకుంటూ కాల్స్‌ చేసుకోవచ్చు. మీరు కనెక్ట్‌ అవగలిగే వైఫై పాయింట్‌ ఉంటే చాలు, మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకపోయినా, లేదా సిగ్నల్‌ బలహీనంగా ఉన్నా  బ్రహ్మాండంగా కాల్స్‌ చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఏమీ ఖర్చు ఉండదు. ప్రస్తుతం మీరు వాడుతున్న ప్లానే పనిచేస్తుంది.

జియో వైఫై కాలింగ్‌ ‘తెలివి’గా పనిచేస్తుందని జియో ప్రకటించింది. వైఫై కాలింగ్‌ ‘ఆన్‌’లో ఉన్నప్పుడు, మొబైల్‌ నెట్‌వర్క్‌ లేదా వైఫై నెట్‌వర్క్‌… ఏ సిగ్నల్‌ బలంగా ఉంటే ఆ నెట్‌వర్క్‌కు ఆటోమేటిక్‌గా అనుసంధానించబడుతుంది. తద్వారా వినియోగదారుడి కాల్‌కు నిరంతరాయంగా కనెక్టివిటీ ఉంటుందని జియో స్పష్టం చేసింది.

జనవరి 16లోపు అని చెబుతున్నప్పటికీ, ఇప్పటికే చాలా నగరాల్లో జియో వైఫై కాలింగ్‌ అందుబాటులోకి వచ్చేసింది. హైదరాబాద్‌లో కూడా ఈ టెక్నాలజీ నేటినుంచి పనిచేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news