ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం నిర్ణయం పక్కన పెడితే ఇప్పుడు కమిటీల నిర్ణయాలు, నివేదికలు మాత్రం ఆశ్చర్యంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు కూడా జగన్ ప్రకటనకు అనుకూలంగా తమ నివేదికలు ఇవ్వడంతో, ఇక హైపవర్ కమిటి నివేదిక ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హైపవర్ కమిటి మొదటి సమావేశం ఇటీవల విజయవాడలో జరిగిన సంగతి తెలిసిందే.
ఇక రెండో సమావేశం శుక్రవారం జరగనుంది. మొదటి భేటీలో అధికార వికేంద్రీకరణ జరగాలను అభిప్రాయపడిన కమిటి రేపు రెండో సమావేశంలో ఏ నిర్ణయ౦ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమావేశంలో రైతులకు అనుకూలంగా కమిటి తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. రెండో భేటీలో ప్రధాన అంశంగా అమరావతి రైతుల సమస్య మీద చర్చ జరిగే అవకాశం ఉంది.
అమరావతి రైతులకు ఇస్తున్న కౌలు డబ్బులను రైతులకు ఇవ్వకుండా వాటి ద్వారా భూములను సాగులోకి తీసుకొచ్చే కార్యక్రమం చెయ్యాలని కమిటి అభిప్రాయపడే అవకాశం ఉందని అంటున్నారు. భూములను వారికి తిరిగి ఇవ్వడం లేదా ప్యాకేజ్ అయినా ఇవ్వాలని కమిటి నిర్ణయిస్తుందని అంటున్నారు. భూములు తిరిగి ఇచ్చేలా ఉంటే వారికి పరిహారం ఏమైనా ఇస్తారా లేక సాగుకి అనుకూలంగా చేసి ఇస్తారా అనేది చూడాలి.