జియో మీట్‌ యాప్‌.. ఒకేసారి 100 మందితో వీడియో కాన్ఫరెన్స్‌..!

-

టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో.. తన వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ జియో మీట్‌ను గురువారం అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ యాప్‌ను గతంలోనే ప్రకటించారు. కేవలం ఎంపిక చేసిన కొద్ది మంది యూజర్లకు మాత్రమే ఇన్విటేషన్‌ ప్రాతిపదికన ఇప్పటి వరకు ఈ యాప్‌ లభ్యమైంది. అయితే ఇప్పుడు ఈ యాప్‌ ఎలాంటి ఇన్విటేషన్లు అవసరం లేకుండానే యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని నాన్‌ జియో కస్టమర్లు కూడా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని వాడవచ్చు.

జియో మీట్‌ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై యూజర్లకు లభిస్తోంది. దీన్ని యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని తమ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ సహాయంతో ఒకేసారి 100 మంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. పూర్తిగా హెచ్‌డీ రిజల్యూషన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఈ యాప్‌కు గాను డెస్క్‌టాప్‌ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించే వ్యక్తులు ఎవరైనా సరే.. ఆ కాన్ఫరెన్స్‌ లింక్‌ను పంపిస్తే.. దాన్ని డెస్క్‌టాప్‌ బ్రౌజర్‌లో యూజర్లు పేస్ట్‌ చేసి ఆ లింక్‌ ఓపెన్‌ చేసి అందులో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. దీని వల్ల డెస్క్‌టాప్‌లో కేవలం ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ సహాయంతోనే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన పని ఉండదు.

ఈ యాప్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ మీటింగ్స్‌ను ముందుగానే షెడ్యూల్‌ పెట్టుకోవచ్చు. ఆ లింక్‌లను ఇతరులకు షేర్‌ చేసి వాటిని ఓపెన్‌ చేయడం ద్వారా ఆ టైముకు యూజర్లు ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేలా చేయవచ్చు. దీంతోపాటు కాన్ఫరెన్స్‌ స్క్రీన్‌షాట్లను ఒకరికొకరు షేర్‌ కూడా చేసుకోవచ్చు. ఇక డెస్క్‌టాప్‌ ఇంటర్నెట్‌ బ్రౌజర్లలో ఈ యాప్‌ను క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌లలో మాత్రమే ప్రస్తుతం ఉపయోగించుకునేందుకు వీలు కల్పించారు.

కాగా జియో మీట్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అయితే గూగుల్‌ ప్లే స్టోర్‌లో, ఐఫోన్లలో అయితే యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో యూజర్లకు అందుబాటులో ఉంది. ఆయా యాప్‌ స్టోర్స్‌లలో యూజర్లు జియో మీట్‌ యాప్‌ను ప్రస్తుతం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఏయే డివైస్‌లు, ఏయే ఓఎస్‌లు, ఏయే హార్డ్‌వేర్‌ ఉంటే.. జియో మీట్‌ యాప్‌ పనిచేస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్‌ – ఓఎస్‌ వెర్షన్‌ 5.0 అంతకన్నా ఎక్కువ ఉండాలి. డివైస్‌ ర్యామ్‌ కనీసం 2జీబీ ఉండాలి.
ఐఓఎస్‌ – ఓఎస్‌ వెర్షన్‌ 9.0 అంతకన్నా ఎక్కువ ఉండాలి. డివైస్‌ ర్యామ్‌ కనీసం 1జీబీ ఉండాలి.
మ్యాక్‌ – ఓఎస్‌ వెర్షన్‌ 10.13 ఆపైన ఉండాలి. డివైస్‌ ర్యామ్‌ కనీసం 2జీబీ ఉండాలి.
విండోస్‌ – విండోస్‌ 10 ఓఎస్‌ ఉండాలి. మైక్రోసాఫ్ట్‌ డాట్‌ నెట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ వెర్షన్‌ 4.5.2 ఉండాలి. డివైస్‌ ర్యామ్‌ కనీసం 4జీబీ ఉండాలి.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై యూజర్లు జియో మీట్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వాడవచ్చు. అదే మ్యాక్‌, విండోస్‌ ప్లాట్‌ఫాంలపై అయితే యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాల్సిన పనిలేకుండానే నేరుగా కాన్ఫరెన్స్‌ లింక్‌ను ఇంటర్నెట్‌ బ్రౌజర్‌లో పేస్ట్‌ చేసి అందులోకి ప్రవేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు.

ఇక ఇప్పటికే యూజర్లకు జూమ్‌, గూగుల్‌ మీట్‌, వెబ్‌ఎక్స్‌ తదితర అనేక వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ జియో మీట్‌ యాప్‌ మాత్రం అంతకు మించిన ఫీచర్లనే కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ యాప్‌లో మొబైల్‌ నంబర్‌ లేదా మెయిల్‌ ఐడీతో రిజిసర్ట్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం వ్యక్తిగత మీటింగ్‌ ఐడీ ఇస్తారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించవచ్చు. ఆ ఐడీ లింక్‌ను ఇతరులకు పంపితే వారు ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. అయితే జియో సిమ్‌ వాడని వారు కూడా ఈ యాప్‌ను ఉచితంగా వాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version