వుమెన్స్ టీ20 చాలెంజ్ కు టైటిల్ స్పాన్స‌ర్‌గా రిల‌య‌న్స్ జియో..!

బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వుమెన్స్ టీ20 చాలెంజ్‌కు గాను టెలికాం దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ జియో స్పాన్స‌ర్‌గా ఉండేందుకు అంగీకారం తెలిపింది. ప్ర‌స్తుతం యూఏఈలో ఇండియ‌న్ ఫ్రీమియ‌ర్ లీగ్ 2020 జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. అయితే ఆ లీగ్ ముగిసేలోపు వుమెన్స్ టీ20 చాలెంజ్‌ను కూడా నిర్వ‌హిస్తారు. దానికి జియో టైటిల్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈ మేర‌కు బీసీసీఐ ఆదివారం ప్ర‌క‌టించింది.

షార్జాలో న‌వంబ‌ర్ 4 నుంచి 9వ తేదీ వ‌ర‌కు వుమెన్స్ టీ20 చాలెంజ్ జ‌రుగుతుంది. అందులో 3 జ‌ట్లు పాల్గొంటాయి. వెలాసిటీ, సూప‌ర్ నోవాస్‌, ట్రెయిల్‌బ్లేజ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతాయి. ఐపీఎల్ ఫైన‌ల్ న‌వంబ‌ర్ 10న ఉండ‌గా అంత‌కు ముందు రోజు అంటే.. న‌వంబ‌ర్ 9న వుమెన్స్ టీ20 చాలెంజ్ ఫైన‌ల్ జ‌రుగుతుంది.

కోవిడ్ నేప‌థ్యంలో అస‌లు వుమెన్స్ టీ20 చాలెంజ్ జ‌రుగుతుందా, లేదా అని సందేహించారు. కానీ బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఆ లీగ్ జరుగుతుంద‌ని ఆగ‌స్టులో క‌న్‌ఫాం చేశారు. అందులో భాగంగానే ఆ లీగ్‌ను ఐపీఎల్‌తోపాటు నిర్వ‌హిస్తారు. ఇక వుమెన్స్ టీ20 చాలెంజ్ కు టైటిల్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో రిలయ‌న్స్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌క చైర్ ప‌ర్స‌న్ నీతా అంబానీ మాట్లాడుతూ.. దేశంలోని యువ‌తులు కూడా క్రీడ‌ల్లో రాణించాల‌నే ఉద్దేశంతో వుమెన్స్ టీ20 చాలెంజ్ కు టైటిల్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని తెలిపారు.

కాగా వుమెన్స్ టీ20 చాలెంజ్ లో ప్ర‌స్తుతానికి ఆస్ట్రేలియా క్రీడాకారిణిలు పాల్గొన‌డం లేదు. ఆస్ట్రేలియాలో వుమెన్స్ బిగ్ బ్యాష్ ఉన్నందున వారు ఇందులో పాల్గొన‌రు. కానీ ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేవ్‌, థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణిలు ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు.