Telangana : గుడ్​న్యూస్.. మరో 2,391 కొలువుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణలో నిరుద్యోగులకు సర్కార్ గుడ్​న్యూస్ చెప్పింది. మరో 2,391 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహాత్మాజ్యోతిబాపులె బీసీ గురుకులాల్లో 2,132 పోస్టులు, సాధారణ గురుకులాల్లో 93, సమాచార పౌరసంబంధాలశాఖలో 166 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రప్రభుత్వం 2022-23 ఏడాదికి 33 కొత్త బీసీ గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలు మంజూరు చేసింది. వీటిలో బోధన, బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురుకులాల్లో అదనపు పోస్టులు మంజూరు చేసేందుకు ఇటీవల మంత్రిమండలి ఆమోదించింది. బీసీ గురుకులాల్లో గ్రూప్‌-3 సర్వీసుల కిందకు వచ్చే 12 జూనియర్‌ అసిస్టెంట్లు, గ్రూప్‌-4 సర్వీసుల పరిధిలోని 141 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఆర్థికశాఖ తెలిపింది.

బీసీ గురుకులాలకు 63 స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేసి, వీటిని వైద్య, ఆరోగ్య నియామక బోర్డు ద్వారా భర్తీ చేయాలని సూచించింది. బీసీ, సాధారణ గురుకులాల్లోని మిగతా పోస్టులన్నీ గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ కానున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news