అమెరికా వెళ్లిన వారికి ఆ దేశం తీపికబురు చెప్పింది. పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని శుభవార్త అందించింది. ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
బీ1 వీసాను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసాను పర్యాటకులకు అమెరికా జారీ చేస్తుంటుంది. ఆ దేశ తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల కేటగిరీలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికా వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ఈ వివరాలను వెల్లడించింది. టెక్ అగ్ర సంస్థల్లో ఇటీవల భారీగా ఉద్యోగాల కోతతో వేలాది మంది విదేశీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నవారు 60 రోజుల వ్యవధిలో మరో ఉద్యోగాన్ని వెతుక్కోలేకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
‘60 రోజుల్లో ఉద్యోగం రాని హెచ్1బీ వీసా ఉన్నవారు ఉద్యోగం కోల్పోయినా వారికి పలు అవకాశాలున్నాయి. ఆ వీసాను మార్చుకోవడం, హోదాను సర్దుబాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవడం, సరైన కారణాలు చూపుతూ ఉద్యోగం మారేందుకు పాత యజమాన్య సంస్థను వదిలేస్తున్నానని దరఖాస్తు చేసుకోవడం వంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి దరఖాస్తులను 60 రోజుల్లోగా చేసుకుని ఉంటే హెచ్1బీ వీసాలున్నవారు ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో ఉండవచ్చు.’ అని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.