ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 2023-24 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సుమారు రూ.45,03,097 కోట్ల బడ్జెట్‌కు గురువారం రోజున లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చ లేకుండానే పద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్న విపక్షాలు తమ ఆందోళనను కొనసాగిస్తుండగానే బడ్జెట్ అంశాన్ని సభ చేపట్టింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయ అంచనాలు, వినియోగ బిల్లులను చర్చ కోసం ప్రతిపాదించారు. ఆ తర్వాత సభాపతి వాటిపై ఓటింగ్ జరిపారు. విపక్ష పార్టీల సభ్యులు సభా మధ్యలోకి వెళ్లి నినాదాలు కొనసాగిస్తుండగానే అధికార పక్షం బిల్లులన్నింటికీ ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్‌కు 2/3వంతు మంది సభ్యుల మద్దతు లభించినట్లయ్యింది. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలో ఉన్నారు. బడ్జెట్ ఆమోదం ప్రక్రియ 12 నిమిషాల్లో ముగిసింది. లోక్‌సభ కార్యకలాపాలకు వరుసగా అంతరాయం కలగడంతో చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదించినట్లైంది. బడ్జెట్ సంబంధిత బిల్లులన్నీ కూడా రాజ్యసభకు బదిలీ కానున్నాయి.