బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీలతో కలిసే బిజేపి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కచ్చితంగా విజయం సాధిస్తామని, సీఎం నితీశ్ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని స్పష్టం చేశారు. బిజేపి బిహార్ రాష్ట్ర కార్యసమితి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు నడ్డా. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్న నేపథ్యంలో తాము ఉమ్మడిగానే బరిలోకి దిగుతామని వివరించారు. కరోనా కట్టడిలో నితీశ్ కుమార్ ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు.
బిహార్లో ప్రతిపక్షానికి సిద్ధాంతాలు గానీ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం గానీ లేదని విమర్శించారు నడ్డా. ప్రజలంతా భాజపా వైపే చూస్తున్నారన్నారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు-నవంబరులో జరగాల్సి ఉంది. నవంబరు 29తో ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు.