జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? ఏపీ నెక్ట్స్ సీఎం కూడా ఆయనేనా..? అంటే అవుననే అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఏపీ నెక్ట్స్ సీఎం అంటూ రాశారు. ఆ ఫ్లెక్సీలో టీడీపీ నేతలు కూడా ఉన్నారు. దీంతో జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
నిజానికి ఏపీ రాజకీయాల్లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడూ ఉండనే ఉంటుంది. టీడీపీ అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ప్రతి ఎన్నికల ముందూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తూనే ఉంది. టీడీపీకి పునర్వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఐతే ఎన్టీఆర్ మాత్రం తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రాలేనని తేల్చేశారు. తన ఫోకస్ అంతా సినిమాలేనని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు.