టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా మరో పతకం సాధించే దిశగా అడుగేసింది. మహిళల డిస్కస్ త్రోలో భారత క్రీడాకారిణి కమల్ ప్రీత్ కౌర్ ఫైనల్ కు చేరింది. శనివారం జరిగి క్వాలిఫికేషన్ రౌండ్ లో కమల్ ప్రీత్ 64 మీటర్లతో రెండో స్థానంలో నిలిచింది.
దీంతో ఆమె ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక క్వాలి ఫికేషన్ రౌండ్ లో కమల్ ప్రీత్ తొలి ప్రయత్నంలో 60.29 మీటర్లు, రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు డిస్కస్ త్రో చేసింది. చివరికి మూడోసారి 64 మీటర్లు విసరడంతో ఫైనల్ కు అర్హత సాధించింది.
మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీమా పూనియా 16 వ స్థానం తో సరిపెట్టుకుని ఇంటి ముఖం పట్టింది. కాగా.. సోమవారం జరిగే ఫైనల్స్ లో మొత్తం 12 మంది పోటీ పడనున్నారు. అక్కడ కూడా కమల్ ప్రీత్ ఇలాంటి అద్భుత ప్రదర్శన చేస్తే.. ఇండియా ఖాతా లో మరో పతకం చేరడం ఖాయమని నిపుణులు అంటున్నారు.