కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ పార్టీలో టికెట్ల పంపిణీ అగ్గిరాజేసింది. టికెట్ ఆశించి భంగపడిన వారంతా బీజేపీకి షాక్ ఇస్తూ రాజీనామాల బాటపట్టారు. కొందరు వేరే పార్టీల్లో చేరుతున్నారు. పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.
ఇటీవలే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి రాజీనామా చేశారు. ఇక ఇవాళ కమలం పార్టికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జగదీశ్ ఆ పార్టీ చేయందుకున్నారు. అసెంబ్లీ సీటు నిరాకరణతోనే జగదీశ్ ఆ బీజేపీకి రాజీనామా చేశారు.
వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళ్లి- ధార్వాడ నుంచి పోటీచేసేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్‌కు బీజేపీ ఈసారి అవకాశం కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన.. ఎంతో సేవ చేసిన తనను కరివేపాకులా తీసిపాడేశారంటూ పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు.