కార్తీకంలో ప్రతిరోజు పరమ పవిత్రమైనవే. అందులో సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి మరింత విశిష్టమైనవి. నవంబర్ 12 మంగళవారం కార్తీక పౌర్ణమి. ఈ మాసంలో మరో పర్వదినం. ఈ పౌర్ణమిని దేవ దీపావళిగా కూడా వ్యవహరిస్తారు.
ఇది శక్తి ఆరాధనకు ముఖ్యమైనది. సహస్రార చంద్రకళా స్వరూపిణి అయిన జగదంబ శ్రీలలితా మహాత్రిపురసుందరిని ఆరాధిస్తే అనంతమైన ఫలాలు లభిస్తాయి. అగ్ని స్వరూపుడైన స్కందుడి ఆరాధనకు కూడా ఇది శ్రేష్టమైన మాసం. తిరువణ్ణామలైలో స్కందుణ్ణి విశేషంగా పూజిస్తారు. కొండపై విశేష దీపాన్ని వెలిగించి, సుబ్రహ్మణ్యుడి నామోచ్ఛారణతో దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తారు. అదొక అద్భుత దృశ్యం. ఆధ్యాత్మిక యోగ సాధనలకు ఈ పూర్ణిమ విశిష్టమైనది.
ఈ రోజున వెలిగించే దీపాలకు- ముఖ్యంగా కాశీ క్షేత్రంలో- విశేష ప్రాధాన్యం ఉంది. దీన్ని ‘దేవ దీపావళి’గా వ్యవహరిస్తారు. కార్తీక పున్నమి రోజు రాత్రి ఆలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. శివాలయాల్లో శివ పార్వతులకు పూజలు చేసి, ఆ ఆది దంపతులను జ్వాలాతోరణం కింది నుంచి ౩సార్లు ప్రదక్షిణ చేయిస్తారు. భక్తులు దీన్ని అనుసరించి అనుగ్రహం పొందుతారు. ఇక సామాజికంగా వనభోజనాలు ప్రాచుర్యం పొందాయి. సామాజిక సామరస్యానికీ, ఐక్యతకూ ఇవి సంకేతాలు. అంతేకాదు పౌర్ణమి ఉదయం, సాయంత్రం 365 వత్తుల దీపారాధన చేయడం, ఉపవాసం, సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. దీపారాధన మొదట ఇంట్లో చేసి తర్వాత దేవాలయంలో చేస్తే మంచిదని పండితుల అభిప్రాయం.
కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు.
– జ్వాలాతోరణం, దీపాలు, అమ్మవారి ఫోటోవాడగలరు