ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా.. అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే..

-

అదేంటి.. కొత్త ఇంటికి వచ్చి వారం కూడా కాలేదు మళ్లీ ఇల్లు ఖాళీ చేస్తున్నారు. అని పక్కింటికి కొత్తగా వచ్చిన మహిళను అడిగింది పొరిగింటావిడ. ఈ ఇల్లు మాకు అచ్చిరావడం లేదండి. వాస్తుకు లేదట. మొన్న గృహప్రవేశం రోజున వచ్చిన పూజారి చెప్పారు. ఆయన చెప్పినప్పటి నుంచి ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తే అది నిజమేనేమో అనిపించింది. అందుకే ఖాళీ చేస్తున్నాం. అని చెప్పింది. ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు వాస్తు చూసుకోకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. చాలా మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. అవేంటంటే..?

చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా రకరకాల కారణాలతో ఇంటికి దూరంగా వేరే ఊళ్లకు వెళ్లి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సొంత ఇల్లు కొనుక్కునే స్తోమత లేని వారు జీవితాంతం అద్దె ఇంట్లోనే గడిపేవారున్నారు. అయితే ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. లేకపోతే ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

ప్రధాన ద్వారం ఏవైపు ఉండాలంటే.. ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ప్రధాన ద్వారం. అద్దె ఇల్లు ప్రధాన ద్వారం ముందు ఎలాంటి చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ వస్తువులు అడ్డులేకుండా చూసుకోవాలి. ప్రధాన ద్వారం ఈశాన్యంలో ఉంటే చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే దక్షిణం, ఆగ్నేయం, నైరుతి వైపు ద్వారం ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు.

 

ప్రధాన ద్వారం తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది వంట గదిపై. ఎందుకంటే అందులో వాస్తు దోషం ఉంటే మీరు అనారోగ్యం బారిన పడే అవకాశముంది. వంటగది ఎప్పుడు ఆగ్నేయ లేదా వాయువ్య దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. పొరపాటున కూడా వంటగదిని ఈశాన్యంలో ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోకండి.

నైరుతి దిశలో బాల్కనీ ఉన్న ఇళ్లలో మారడం మీకు భారంగా ఉంటుంది. అదే సమయంలో..  మాస్టర్ బెడ్ రూమ్  నైరుతి దిశలో ఉండాలి. ఇక టాయిలెట్ ఈశాన్య దిశలో ఉండకూడదు.

మీరు ఇల్లు అద్దె తీసుకుంటున్నప్పుడు తలుపులన్నీ లోపలికి తెరిచేలా ఉండాలని గుర్తుంచుకోండి. అలాగైతే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. కొత్తగా అద్దె ఇంట్లో దిగినప్పుడు ఆ ఇంటి తలుపుల్లో నూనె వేయండి. తలుపుల నుంచి వచ్చే శబ్ధం కూడా ఇంట్లో కలహాన్ని కలిగిస్తుందట. ఇక నుంచి మీరు అద్దె ఇంట్లోకి మారాలనుకుంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news