చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారతదేశ పర్యటన సందర్భంగా చెన్నై సమీపంలోని మామల్లపురంలో ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ నేపథ్యంలో కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మోదీ-జిన్‌పింగ్ అనధికార శిఖరాగ్ర భేటీలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేశారు.
కశ్మీర్ భారత అంతర్గత విషయమన్న మన వైఖరికి అందరికీ సుస్పష్టంగా తెలిసిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అధికార లాంఛనాలకు లేకుండా రెండురోజులపాటు జరిగిన మోదీ-జిన్‌పింగ్ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జిన్‌పింగ్ కాన్వాయ్ వద్దకు స్వయంగా వెళ్లి ఆయనను సాగనంపారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీతో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు. మోదీ ఆతిథ్యం తమను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.