ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని మొత్తం 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టిన చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. సమ్మె విషయంలో అటు ఆర్టీసీ ఉద్యోగులు.. ఇటు ప్రభుత్వం బెట్టు సడలించడం లేదు. అయితే తాజాగా సమ్మెపై మరోసారి ప్రభుత్వం స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడఅజయ్ తెగేసి చెప్పారు.
ఆర్టీసీని విలీనం చేస్తామని కానీ.. ప్రైవేటీకరిస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని పండగ సమయంలో సమ్మెకు వెళ్లారని అజయ్ విమర్శించారు. 2014బ్యాలెన్స్ షీట్‌లో ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4,416 కోట్లు అని.. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీకి నష్టాలే వచ్చాయన్నారు. కేసీఆర్ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీకి 14 కోట్ల లాభం వచ్చిందన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3,303 కోట్లు ఇచ్చిందని అజయ్ స్పష్టం చేశారు.