నో ఇంట‌ర్.. నేరుగా డిగ్రీయే.. 8 తరగతి నుంచే సెమిస్టర్ విధానం!

-

దేశంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి నూతన విద్యా విధానం-2019 ముసాయిదా కోసం కేంద్రం ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ సారధ్యంలో కమిటీని వేసింది. ఈ కమిటీ తయారుచేసిన నివేదిక ప్రకారం సెకండరీ విద్య పరిధిలోకి 8వ తరగతి నుంచి 12వ తరగతిని తీసుకురావాలి. అంతేకాకుండా 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏటా రెండు సెమిస్టర్లను నిర్వహించాలి. అలాగే వృత్తి విద్యను కూడా పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలని స్పష్టం చేసింది.

iit Jee 2019 exam postponed

మూసాయిదాలో ముఖ్యాంశాలు

– అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లతో అనుసంధానించాలి, వీలైతే రెండింటినీ ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తెచ్చి స్కూల్ కాంప్లెక్స్ పేరుతో నిర్వహించాలి.
– హయ్యర్ సెకండరీ విద్యను, సెకండరీ విద్యను కలిపి సెకండరీ విద్యగానే కొనసాగించాలి. అందులో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలి.
– జూనియర్ కాలేజీ విధానాన్ని రద్దు చేయాలి. 11వ, 12వ తరగతి విధానం అమలు చేయాలి.
– కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలోనే కొనసాగించాలి. వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే అమలు చేయాల. వృత్తి విద్యను పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలి.

ఎన్నికల విధులకు టీచర్లు వద్దు!

ప్రతిభావంతులైన వారు ఉపాధ్యాయ విద్యలోకి వచ్చేలా ప్రోత్సహించాలి. అంతేకాదు టీచర్లకు బోధనతో సంబంధం లేని ప్రభుత్వ పనులను తగ్గించాలి. అంటే ఎన్నికల విధులు, సర్వేలకు టీచర్లను దూరంగా ఉంచాలి. పాలనా సంబంధ విధులను అప్పగించవద్దు. వారు పూర్తిగా బోధన, అభ్యసన పనుల్లోనే నిమగ్నం అయ్యేలా చూడాలి.

– ప్రతి టీచర్ తన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కనీసం 50 గంటలు కేటాయించేలా చూడాలి.
– ప్రైవేట్ స్కూల్స్ పబ్లిక్ అనే పదాన్ని ఉపయోగించకూడదు. ఆ పదం కేవలం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలకే ఉండాలి.

టీచర్ల నియామకాలలో డెమో తప్పనిసరి!

ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో డెమో తప్పనిసరి చేయాలని కస్తూరి రంగన్ కమిటీ సిఫారసు చేసింది. ఇక మీదట టీచర్ నియామకాలల్లో టెట్‌తోపాటు క్లాస్‌రూమ్ డెమో అమలు తప్పనిసరి చేయాలని సూచించింది. 5-7 నిమిషాల క్లాస్‌రూమ్ డెమోను కచ్చితంగా అమలు చేస్తే ప్రతిభావంతులను ఎంపిక చేయవచ్చని అభిప్రాయపడింది. అదేవిధంగా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:30గా కొనసాగించాలని పేర్కొంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news