రామాయణం (బాలకాండ)-4- వాల్మీకి చెప్పిన మొదటి శ్లోకం ఇదే!

-

నారద మహర్షి ద్వారా రామకథని విని, మనస్సంతా సంతోషంతో నిండిపోయిన వాల్మీకి. నారదున్ని పూజించి సాగనంపి గంగానది సమీపంలోని తమసా నదికి తన శిష్యుడైన భరద్వాజుడితో మధ్యాహ్న స్నానానికి వెళ్తాడు. అ సమయంలో నది చుట్టూ ఉన్న వనంలోని అందాన్ని పరిశీలించడం ప్రారంభించాడు వాల్మీకి. అంతలో ఆయన కళ్లు ఒక చెట్టుపై నిలిచిపోయాయి. ఆ చెట్టు కొమ్మ మీద క్రౌంచపక్షు జంటమీద వాలాయి. జంటలోని పరస్పర ప్రేమానురాగాలని పరిశీలించసాగాయి మహర్షి నేత్రాలు. ఆ రెండు రతిపారవశ్యంలో ఉన్నాయి. మగపిట్ట తన రెక్కలతో ఆడపక్షిని కప్పివేసింది. అంతలో ఒక పిట్టనుకొట్టేవాడు పోతుపిట్టని కొట్టాడు. అది నేలబడింది. ఆడపిట్ట విలపిస్తూ నెత్తురుముద్దలా ఉన్న పక్షిచుట్టూ కరుణాతికరుణంగా తిరుగసాగింది. వాల్మీకి హృదయం ద్రవించింది. అంతో ఆయన నోటిగుండా శ్లోకం వెలువడింది.

మానిషాద ప్రతిష్టాం త్వమగమ శ్శాశ్వతీస్సమాః
యత్క్రౌంచమిథునాదేక మవధీః కామమోహితమ్

ఛందోబద్ధమైన వాక్యం, వాల్మీకి నోట అప్రయత్నంగా వెలువడింది. వచ్చింది ఏమిటో తనకు తెలియదు. ఆయన శరీరం ఆయన వశంలో లేదు. కొంతసేపటికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తన నుంచి వచ్చిన ఆ వాక్యాన్ని మళ్లీమళ్లీ చదువుకున్నాడు. పక్షి శోకంతో, హృదయం నిండగా వచ్చినది కాబట్టి ఇది శోకం నిండినది కాబట్టి శ్లోకం అని పేరుపెట్టాలని భావించాడు. వాల్మీకి శోకం లోకం కోసం కాబట్టి శోకం+లోకం= శ్లోకం అయింది. ఇదే సంసృ్కతంలో మొదటి శ్లోకం.

ఈ శ్లోకంలో 4 పాదాలు ఉంటే ప్రతిపాదానికి అక్షరాలు సమంగా ఉన్నాయి. సంగీతానికి సరిపోతున్నాయి. ఆ శ్లోకం గురించి ఆలోచిస్తున్న వాల్మీకి బ్రహ్మ ప్రతక్ష్యమవుతాడు. మహర్షీ! నీవు చెప్పింది శ్లోకమే. నా ఆజ్ఞవల్ల నీ నుంచి సరస్వతి వచ్చింది. ఇలాంటి వాక్యాలతోనే రామకథని నువ్వు రాయాలి! నువ్వు చెప్పే కావ్యంలో అసత్యం ఉండదు. ఈ ప్రపంచంలో నదులూ,పర్వతాలు ఉండేంతవరకూ నీ రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది అని చెప్తాడు బ్రహ్మ.

ఈ శ్లోకానికి ఐదు అర్థాలు అవి తెలుసుకుందాం..
1. ఓ నిషాదుడా! క్రౌంచపక్షుల జంట నుంచి మగపక్షిని చంపిన కారణంగా నీవు ఎక్కువ కాలం జీవించకుందువుగాక ఇది బోయవాని పరమైన అర్థం.

2. మా (లక్ష్మీకి) నిషాదుడవైన (భర్త) ఓ రామా! సీతా విషయంలో కామమోహితుడైన రావణుణ్ణి, రావణమండోదరుల జంటనుంచి చంపి శాశ్వత ప్రతిష్టనీ, కీర్తిని పొందుదువుగాక! అని రామ పరంగా అర్థం మానిషాద అనడం వలన బోయవాణ్ణి శ్రీ మహావిష్ణువుగా వాల్మీకి గమనించడం కేవలం ఆ స్థితిలోనే అని ఈ శ్లోకం చెప్తుంది.

3. ముల్లోకాలనీ బాధపట్టే ఓ రావణుడా! రాజ్యం పోయి, వనవాసం చేస్తూ క్షీణించిన సీత అనే అల్పజీవిని చావుతో సమానమైన భర్త వియోగ దుఃఖాన్ని కలిగించిన కారణంగా శాశ్వత కాల కీర్తిని నీవు పొందకుండుదువుగాక! బ్రహ్మ ఇచ్చిన వంశాభివృద్ధి వరం ఫలింపకుండుగాక అని రావణపరంగా అర్థం.
మిగిలిన అర్థాలను వచ్చే వారం తెలుసుకుందాం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news