మంత్రి వర్గ ప్రక్షాళన ? సంచలన నిర్ణయం దిశగా కేసిఆర్ ?

దుబ్బాక ఎన్నికల ఫలితాలతో దిమ్మ తిరిగే షాక్ లో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుండటం, ముఖ్యంగా పంతులు కొంతమంది కీలక నాయకుల వ్యవహార శైలి కారణంగా , ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు కేసీఆర్. అందుకే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు, పార్టీకి ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగపడ ని వారిని తప్పించి యాక్టివ్ గా ఉండే వారిని మాత్రమే మంత్రివర్గంలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ఉండడంతో, ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలా లేక ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ తెచ్చుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ ను ఆషామాషీగా చూడకూడదని, ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని , బిజెపి బలపడేందుకు ఇదే సరైన సమయమని, ఆ పార్టీకి అవకాశం దక్కకుండా చేసేందుకు మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అంటూ కెసిఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.

వరంగల్ ఖమ్మం నల్గొండ, మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పూర్తి బాధ్యతలను ఆయా జిల్లాల పరిధిలో ఉన్న మంత్రులది మాత్రమే అని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు.ఇక్కడ కనుక ఫలితాలు తేడా కొడితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందుగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పై చాలా కాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ కుమార్తె కవిత మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని, దానికోసమే మంత్రివర్గ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్లు సమాచారం. దీనిపై రెండు మూడు రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా టిఆర్ఎస్ లోని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.