తెలంగాణలో నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఇక పార్టీలన్నీ ఇక ప్రచారంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగానే సోమవారం ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి..ఎన్ని టక్కుటమరా విద్యలు ప్రదర్శించిన తెరాస విజయాన్ని ఆపలేరని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ ఖమ్మంలోని 10 నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొంచెం కఠినంగా అనిపించినా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉంటాయి అంటూ తనదైన శైలిలో ప్రతిపక్షాలపై మాట తూటాలు సందించారు.
ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డు వస్తుంటారు. మనం ఎవరూ శాశ్వతం కాదు. జిల్లా, రాష్ట్రం ప్రజలు శాశ్వతం. ప్రస్తుత పరిస్థితులను గమనించి ఓటేయ్యాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రగతిని ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్న ఈ తరుణంలో ప్రతిపక్షాలు మాత్రం ఏదో రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతోందని తెలిపారు.