కరోనా వైరస్ నిజంగానే విస్తరిస్తే తనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఎవరూ కూడా మాస్కులు పెట్టుకోకుండా పని చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాసనసభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న కరీంనగర్ కు ఆయన ఉన్నత అధికారులతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం ఆయన కరీంనగర్ వెళ్లాల్సి ఉంది.
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన శనివారం ఆ పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రామగుండం, కరీంనగర్ ప్రాంతాల్లో స్వయంగా ఆయన పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు గా భావిస్తున్న ప్రాంతాల్లో స్వయంగా తాను పర్యటించి ఎక్కువ మంది నివాసం ఉండే ప్రాంతాల్లో కి వెళ్లి అవసరమైతే వారి ఇళ్ళలో కూడా వెళ్లి ఆయన ధైర్యం చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కెసిఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం అనేది నిజంగా అభినందనీయమని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు18 నమోదయ్యాయి. అయితే వారందరూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరికీ లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరీంనగర్ లో మత ప్రచారం కోసం నుంచి వచ్చిన వారికి కరోనా సోకిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.