నిన్న ప్రగతి భవన్ ని పీపీఈ కిట్లు ధరించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు ముట్టడించిన కేసులు మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడించిన వారిలో కేసీఆర్ మనవడు రితేష్ కూడా ఉన్నాడు. నిన్న మొత్తం ప్రగతి భవన్ ని ముట్టడించిన 20 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తల మీద కేసులు పెట్టగా దానికి సంబందించిన ఎఫ్ఐఆర్ లో ఏ5గా రితేష్ ఉన్నాడు.
ప్రస్తుతానికి వీరందరినీ రిమాండ్ కు తరలించారు. ఈ రితేష్ కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్న రమ్యరావు కుమారుడు. దీంతో ప్రభుత్వం మీద రితేష్ తల్లి రమ్యరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కరోనా ఉన్నా పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ వీరంతా పీపీఈ కిట్లు ధరించి ఓ డీసీఎంలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు గుర్తించేలోగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ లోపలకి వెళ్లేందుకు బారికేడ్లు ఎక్కడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మొత్తం అందరినీ వ్యాన్ లో ఎక్కించి గోషామహల్ పీఎస్ కు తరలించారు.