ఏపీలో గత రెండు నెలలుగా రాజకీయం ఎలా రంగులు మారుతుందో ? చూస్తూనే ఉంటున్నాం. ఇక ఆగస్టు నెల అంటేనే టీడీపీకి ఎన్ని షాకులు తగిలాయో గత కొన్నేళ్లుగా తెలిసిందే. ఆగస్టు అంటేనే టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. ఇక ప్రస్తుతం ఆగస్టు నెల జరుగుతుండడంతో మళ్లీ టీడీపీలో ఆగస్టు టెన్షన్ నెలకొంది. ఓ వైపు ఆగస్టులోనే విశాఖలో రాజధానికి పునాది పడుతుందని..సీఎం జగన్మోహన్ రెడ్డి చెపుతుంటే మరోవైపు అదేవిశాఖ నుంచి ఓ బిగ్ షాట్, మాజీ మంత్రి, నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారన్న ప్రచారం అయితే జరుగుతోంది. గంటా పార్టీ మారే విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారని… ఆయన మంచి ముహూర్తం చూసుకుంటున్నారని అనుకున్నారు. .
అయితే గంటా పెట్టుకున్న ముహూర్తం దగ్గర పడుతోన్న కొద్ది ఇప్పుడు గంటా పార్టీ మార్పుపై మరో వార్త వస్తోంది. ఇటీవల పరిణామాల నేపధ్యంలో గంటా శ్రీనివాసరావు వైసీపీ ఎంట్రీకి పెద్ద బ్రేకులు పడిపోయాయి. గంటా పార్టీలోకి వస్తే పార్టీకి లాభం ఎంత ? నష్టం ఎంత ? అని బేరీజు వేసుకున్న జగన్ ఇప్పుడు గంటాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. పైగా గంటా లాంటి ఊసరవెల్లి నేతలు పార్టీలోకి వస్తే న్యూట్రల్ జనాల్లో సైతం పార్టీకి మైనస్ అవుతుందని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోందట. ఇక ఇటీవల గంటా శ్రీనివాసరావు సొంత మేనల్లుడు మీద భూ కబ్జా కేసులు నమోదు కావడంతో జగన్ ఆలోచనలు మారాయని కూడా అంటున్నారు.
ఇక మంత్రి అవంతి, జిల్లా ఎమ్మెల్యేలు, విజయసాయి లాంటి వాళ్లకు గంటా పార్టీలోకి రావడం ఇష్టంలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ దారులు మూసుకుపోతుండడంతో గంటా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని భోగట్టా…? బీజేపీకి కూడా ఆర్థిక, సామాజిక కోణాల నేపథ్యంలో గంటా లాంటి వాళ్లు అవసరం. ఇక ఇప్పుడు గంటా సామాజిక వర్గానికే చెందిన సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. కాపు వర్గాన్ని ఏకీకృతం చేసేందుకు బీజేపీ చేస్తోన్న ప్లాన్‌లోనే ఇప్పుడు గంటాను కూడా తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు వీర్రాజు ద్వారానే ప్రారంభించిందట. గంటా కూడా టీడీపీలో ఉంటే లైఫ్ లేదు… వైసీపీ రానివ్వడం లేదు.. ఇప్పుడు బీజేపీయే ఆప్షన్ అని భావిస్తున్నారట. మరి గంటా రాజకీయం ఎలా టర్న్ అవుతుందో ? చూడాలి.