మునుగోడు ఉపఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, మునుగోడు నాయకులతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో ప్రచార పర్వాన్ని తెరాస ప్రారంభించింది. కేసీఆర్ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి మునుగోడుపై హామీల వరాలు కురిపించారు. మరోసారి నియోజకవర్గ ఓటర్లను ఎలా ఆకర్షించాలనేదానిపై ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
మునుగోడులో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే తెరాస పావులు కదుపుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్నిప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డి సహా ఇతర నేతలు నియోజకవర్గంలో ఉండి ఉపఎన్నికకు పార్టీ శ్రేణులను సంసిద్ధులను చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఉపఎన్నికకు సంబంధించి నేతలతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఓటర్ల అభిప్రాయాలపై మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యారు.