కేంద్ర మంత్రి గడ్కరీతో కేసీఆర్‌ భేటీ..వీటిపైనే చర్చ

ఢిల్లీ : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటి అయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు భేటీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రంలో రోడ్లు, జాతీయ రహదారుల అంశంపై ఈ సందర్భంగా పలు వినతి పత్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణకు రాష్ట్ర రోడ్డు మౌలిక సదుపాయాల నిధుల కింద 2021 ఏడాదికి రూ. 744 కోట్లు ఇవ్వాల్సి ఉందని.. కానీ, ఇప్పటివరకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించారని లేఖల్లో పేర్కొన్నారు.

ఆమోదం పొందిన రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,306 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని నిర్ణయించారని.. ఇప్పటివరకు 2,168 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు కెసిఆర్. మిగిలిన 1,138 రహదారుల్లో 4 రాష్ట్ర అత్యంత ప్రధాన రహదారులు ఉన్నాయని తెలిపారు. “రీజనల్ రింగ్ రోడ్డు”లో భాగమైన చౌటుప్పల్-కంది 182 కిలోమీటర్లు, కరీంనగర్-పిట్లం 165 కిలోమీటర్లు, కొత్తకోట – మంత్రాలయం 70 కిలోమీటర్లు, జహీరాబాద్-దేగ్లుర్ 25 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరారు.