తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విశాఖ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ విశాఖకు బయలుదేరతారు. కుటుంబసభ్యులతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్ ఆయన వెంట ఉంటారు. విశాఖకు చేరుకుని అక్కడ ఉన్న శారదా పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అవుతారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయాలను సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అయి జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి దిల్లీ వెళ్తారు. 26న సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఢిల్లీలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో భేటీ అవుతారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను సైతం కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు.