సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యేవాడా? అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే..కేసీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం వచ్చిందని ఆరోపించారు . ఇప్పుడు తెలివిగా కాంగ్రెస్ ఏం చేసిందని విచిత్రంగా మాట్లాడుతున్నాడని జగ్గారెడ్డి మండిపడ్డారు.
మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పవర్ కోల్పోవడంతో కేసీఆర్ మైండ్ సరిగ్గా పని చేయడం లేదని అన్నారు.అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ ఆగమయ్యే వాడని,పదేళ్లు పవర్‌లో ఉండి అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేశాడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ ఒకే విధానాన్ని అవలభించారని అన్నారు. ఇందిరమ్మ పరిశ్రమలు పెడితే, మోడీ వాటిని అమ్ముకుంటున్నాడని విమర్శించారు.గతంలో నిబద్ధత కలిగిన రాజకీయ నేత వాజ్‌పాయ్ కూడా నిండు పార్లమెంట్‌లో ఇందిరమ్మను అపర కాళీ అని ప్రశంసించారు అని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ కాంగ్రెస్‌ను విమర్శించడం దారుణమని మండిపడ్డారు.