దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. దళిత వర్గానికి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో ‘మా ఇంటికి వస్తారా సార్’? అని అడిగిన ఓ ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి భోజనం చేసిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈసారి అతడి కుటుంబానికి తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు.
అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు హర్ష్ సోలంకి తన కుటుంబంతో కలిసి దిల్లీకి వెళ్లారు. దిల్లీ విమానాశ్రయంలో ఆ కుటుంబానికి ఎంపీ రాఘవ్ చద్దా సాదర స్వాగతం పలికారు. అనంతరం దిల్లీలోని ప్రభుత్వ పాఠశాల, ఆస్పత్రులను సందర్శించారు.
తన ఇంటికి చేరుకున్న హర్ష్ సోలంకిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేజ్రీవాల్.. ఆ కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా హర్ష్ సోలంకి కేజ్రీవాల్‌కు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని బహూకరించారు.