పేషెంట్ల కోసం పెళ్లి వాయిదా వేసుకున్న కేరళ డాక్టర్‌

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరులో డాక్టర్‌లు ప్రదర్శిస్తున్న స్ఫూర్తి గురించి ఎన్ని మాటలు చెప్పిన తక్కువే. కొందరు వైద్య సిబ్బంది తమ వ్యక్తిగత ఆనందాలకు దూరంగా ఉంటూ కూడా కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. అలాంటి జాబితాలోనే నిలుస్తారు కేరళకు చెందిన 23 ఏళ్ల వైద్యురాలు షిఫా ఎం మహమ్మద్‌. కరోనాపై యావత్తు ప్రపంచం పోరు చేస్తున్న సమయంలో పెళ్లిని వాయిదా వేసుకుని.. డాక్టర్‌గా వృతి ధర్మాన్ని నిర్వహించాలని షిఫా నిర్ణయించుకుంది.

వివరాల్లోకి వెళితే.. షిఫా కేరళలోని పారియారం మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో హౌస్‌ సర్జన్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులోని పేషంట్లకు వైద్యం అందిస్తున్నారు. అయితే మార్చి 29న దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త అనుస్‌ మహమ్మద్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిని కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవాలని షిఫా నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాతైనా పెళ్లి చేసుకోవచ్చు.. కానీ ప్రాణాలతో పోరాడుతున్న రోగులకు మాత్రం అత్యవసర చికిత్స అవసరమని భావించింది. ఈ విషయాన్ని షిఫా తన తల్లిదండ్రులకు చెప్పినప్పడు వారు కూడా ఆమె నిర్ణయానికి అడ్డుచెప్పలేకపోయారు. ఇదే విషయాన్ని ఆమె అనుస్‌, అతని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించింది.

షిఫా తీసుకున్న నిర్ణయంపై ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆనందం కంటే సామాజిక బాధ్యతగా తన వృతి ధర్మం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. షిఫాను చూస్తే గర్వంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు షిఫా అక్క కూడా కోజికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version