కరోనా టీకా… ఈ ఘనత కేరళకు మాత్రమే చెల్లింది

-

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన విషయం తెల్సిందే. అయితే దేశ జనాభాకు సరిపడా వ్యాక్సిన్ ఉత్పత్తి లేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతుంది. అయితే ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఒక మిల్లీ లీటర్‌ వ్యాక్సిన్‌ కూడా ఎంతో కీలకం. అయితే చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్‌ను వృథా చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో దాదాపు 5 నుంచి 12 శాతం వరకు వ్యాక్సిన్‌ వృథా అవుతుంది. అయితే ఈ విషయంలో కేరళ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ డోసులను వేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

ఇప్పటివరకు కేంద్రం కేరళ రాష్ట్రానికి 73,38,806 డోసులు ఇవ్వగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 74,26,164 డోసులు ప్రజలకు వేసింది. అయితే కేంద్రం ఇచ్చిన మోతాదు కంటే ఎక్కువ వేయడం ఎలా సాధ్యం అనే సందేహం వచ్చిందా..? అయితే అదెలా సాధ్యమయిందో చూద్దాం. 1.1 శాతం వృథాను కలుపుకొని కేంద్రం ఒక్క వ్యాక్సిన్‌ వయల్‌ను ఇస్తుంది. సాధారణంగా ఒక వయల్‌ నుంచి 8 నుంచి 9 డోసులు ఇస్తారు. అయితే కేరళ ఆరోగ్య సిబ్బంది మాత్రం 1.1 శాతం వృథాను కలుపుకొని ఓ వయల్‌ నుంచి 11 నుంచి 13 డోసులు వరకూ ఇస్తున్నారు. అంటే కేంద్రం ఇచ్చిన వృథా టీకాను కూడా వారు సద్వినియోగం చేసుకుంటున్నారు.

దీని వల్ల ఆ రాష్ట్రం తనకిచ్చిన కోటా కంటే అధికంగా 87,358 డోసులు ప్రజలకు వేసి టీకాను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్న రాష్ట్రంగా నిలిచింది. కాగా ఒక్క వ్యాక్సిన్‌ వయల్‌ తెరిచాక నాలుగు గంటలలోపే వినియోగించాలి. లేకపోతే ఆ డోసులతో ఉపయోగం ఉండదు. అయితే చాలా రాష్ట్రాల్లో నలుగురైదుగురు వచ్చినా వయల్‌ తెరిచి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. కానీ కేరళలో మాత్రం పది మంది వస్తేనే ..వయల్‌ తెరుస్తున్నారు. ఈ రకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేరళ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version