రైతుల రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. అయితే గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ సర్కారు నిధుల సమీకరణపై ఫోకస్ పెంచింది. తొలుత జులై 15 నుంచి రూ. 50వేల లోపు, ఆ తర్వాత రూ. 75వేలు, రూ. లక్ష….ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70% మందికి రూ. లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపై చర్చ జరుగుతోంది.
అయితే ప్రభుత్వ భూములను కుదవ పెట్టి లోన్లు తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 760 ఎకరాల భూమిని సైతం ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.48వేల కోట్ల భూములను తనఖా పెట్టడం ద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్లు ఏక కాలంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం అమ్మి పథకాలను ఇంప్లిమెంట్ చేయగా.. భూములను అమ్మడం కన్నా తనఖా పెట్టడం మేలు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. టీజీఐఐసీ వద్ద ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అంశం చర్చకు రాగా.. ఈ భూములను తనాఖా పెట్టి నిధులు సమకూర్చుకుంటే ఎలా ఉంటుందని సీఎం అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.