తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు త్వరలో ఉంటాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా కొనసాగించారని వెల్లడించారు. ఇప్పుడు ఆ పదవీకాలం పూర్తయింది. అధ్యక్ష మార్పు అనివార్యం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించారని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి కాబట్టి తెలంగాణ సహా ఇంకా అనేక రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష మార్పులు ఉంటాయని వివరించారు. క్యాబినెట్ కసరత్తు పూర్తయిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులపై త్వరలోనే కసరత్తు చేసి కొత్తవారిని నియమిస్తారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.