ఒక పక్కన వరదలు ముంచెత్తుతొంటే మరో పక్క ప్రోటోకాల్ ఇష్యూ అంటూ అధికారుల మీద ఫైర్ అవుతున్నారు మన నేతలు. వివరాల్లోకి వెళ్తే జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ వరదల నేపధ్యంలో హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. అయితే ఆయన ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్ళిన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి సందర్శన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు దూరంగా ఉండడం ఏమిటని ఆయన సీరియస్ అయ్యారు.
అప్పటికప్పుడు జీజేచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి, కనీసం డీఈ , ఏఈ స్థాయి అధికారులను పంపించకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఒక్కరూ రాకపోతే తాను వివరాలు ఎలా తెలుసుకుంటానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మళ్ళీ ఢిల్లీ వెళ్లిపోవాలని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు తన పర్యటనకు తహశీల్దార్ లు కూడా వచ్చే స్థాయి కూడా కాదా అని ఆయన నిలదీశారు. ఇక అనంతరం హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో ఫోన్ లో మాట్లాడిన మంత్రి, నీళ్లల్లో ఉన్న నివాసితులకు నిత్యావసరాలు, పాలు, ఆహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక ఆయన ఫోన్ తో కదిలిన జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆయన వెంట నడిచింది. జోనల్ కమిషనర్ ప్రవనిక,ఇతర అధికారులు ఆయన పర్యటిస్తున్న ప్రాంతాలకి వెళ్ళారు.