కొత్త మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డికి… మోడీ సర్కార్ స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్నటి వరకు సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి….కేబినెట్ హోదా దక్కించుకున్నారు. అయితే దీనిపై స్పందించారు కిషన్ రెడ్డి. తనకు కేబినెట్ హోదా కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు కిషన్ రెడ్డి.
ప్రధానమంత్రి మోడీ అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అమిత్ షా గారి శిక్షణలో క్రమశిక్షణతో పాటు చాలా విషయాలు తెలుసుకున్నానని వెల్లడించారు. ఇందుకు గానూ వారికి కృతజ్ఞుడనై ఉంటానని చెప్పిన కిషన్ రెడ్డి… బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాని వెల్లడించారు.
“నవభారత నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం సాకారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతానికి నా ముందున్నాయి” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తనను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.