ఖాయా.. పీయా.. చ‌ల్దియా.. కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చిన కిషన్ రెడ్డి!

-

మీకు గుర్తే ఉంటది. స‌రిగ్గా రెండేళ్ల క్రితం రాష్ట్రస్థాయి మున్సిపల్ సమ్మేళనంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల‌ను ఉద్దేశించి ఓ కీల‌క వ్యాఖ్య చేశారు. “మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా…ఖాయా పీయా చల్దియా.. అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి, అడ్డదిడ్డంగా ఎటుపడితే అటు కాదు. అది మీ చేతుల్లో ఉంది. ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్ నైట్ లో చేసేస్తాం అని మాట్లాడవద్దు” అని హిత‌బోధ చేశారు. అంతేగాకుండా..హైద‌రాబాద్ లో అయితే ఎక్క‌డ‌యినా కొత్త ఇల్లు క‌డుతున్నారంటే చాలు..ఇంటి ముందు ఇసుక క‌నిపిస్తే అధికారులు, కార్పొరేట‌ర్లు గ‌ద్ద‌ల్లా వాలిపోతున్నారు. ఇక‌పై ఇది చెల్ల‌దు అని హెచ్చ‌రించారు.

స‌రిగ్గా ఇలాంటి హెచ్చ‌రిక‌నే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి బ‌ల్దియాలోని త‌మ కార్పొరేట‌ర్ల స‌మావేశంలో చేయ‌డం గ‌మ‌నార్హం. “మ‌న వాళ్ల‌పై చాలా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. జాగ్ర‌త్త‌గా ఉండాలి. కొత్తగా నిర్మించే భ‌వ‌నాల‌కు దూరంగా ఉండాలి.వాటి జోలికి పోవ‌ద్దు.ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ సీరియ‌స్ గా తీసుకోవాలి” అని కొంచెం ఘాటుగానే హెచ్చ‌రించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తుంటే బీజేపీ కార్పొరేట‌ర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారా? అవినీతికి పాల్ప‌డుతున్నారా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

నిజానికి టౌన్ ప్లానింగ్ అధికారుల సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వారికి పెద్ద మొత్తంలో ముట్ట‌జెప్పంది ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. అనుమ‌తులు రావు. ఇక కార్పొరేట‌ర్ల‌కు ల‌క్ష‌ల్లో స‌మ‌ర్పించుకోవ‌డం మామూలే. లేదంటే వారు సృష్టించే అడ్డంకులు అన్నీఇన్నీ కావు.

గ‌తంలో ఒక‌సారి మంత్రి కేటీఆర్ కూడా స‌మీక్ష నిర్వ‌హించిన‌పుడు కూడా త‌మ పార్టీ కార్పొరేట‌ర్ల‌పై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ కార్పొరేట‌ర్ ను ఉద్దేశించి ఇది నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా? అధికారులు మీ డివిజన్ లో తిరగాలి అంటే.. నీ అనుమతి తీసుకోవాలా? ఎక్కువ చేస్తే..పార్టీ నుండి సస్పెండ్ చేస్తా“ అని మండిప‌డ్డారు. ఇప్పుడు కిష‌న్ రెడ్డి కూడా అదే స్థాయిలో క‌న్నెర్ర జేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తుంటే బీజేపీ కార్పొరేట‌ర్ల వ్య‌వ‌హారంలో ఏదో తేడా కొడుతోంద‌నే చ‌ర్చ‌కు దారితీస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news