ప్రముఖ రచయిత, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘విమర్శిని’కి 2018కి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2019 జనవరి 29న ఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఆయన రాసిన ‘అనంత జీవనం’కు ప్రతిష్టాత్మకమైన మూర్తిదేవి అవార్డు లభించింది. తెలుగులో ఇనాక్ అనేక నవలలు రాశారు. అందులో ‘ఊరబావి’ ప్రధానమైంది. సమాజంలోని అసమానతలు, అణచివేతలు.. గురించి ఇనాక్ కథలు రాస్తారు. గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో 1939లో ఇనాక్ జన్మించారు.
ఉన్నత స్థానానికి ఎదగాలనే పట్టుదలే ఇనాక్‌కు డాక్టరేట్ ఇప్పించింది. అధ్యాపకుడిని చేసింది. ఉపకులపతి పదవి పొందేలా చేసింది. వృత్తి రీత్యా ఎంత ఎదిగినా, ఇనాక్ జీవితం తాలూకు అనుభవాలు, ఆయనలోని సృజనశక్తి ఇనాక్‌ను రచయితను చేశాయి. ఇనాక్ తన రచనలతో ఎంతో మందిని ప్రభావితం చేశారు.