కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా సీఎం కెసిఆర్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలన్నారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అన్నారు సీఎం కేసీఆర్.
భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని సూచించారు. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టు లో జరగాలన్నారు. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని సూచించారు సీఎం కేసీఆర్.
సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలన్నారు. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలని.. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని తెలిపారు. మళ్లీ కొండగట్టుకు వస్తానని.. ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.