నెల్లూరు వైసీపీలో ముసలం రోజురోజుకు ముదురుతోంది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేసిన వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం జగన్ నియమించారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ఇవాళమరోసారి మీడియా ముందుకు రానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడనున్నారు. రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారనేదానిపై ఆధారాలు బయపెట్టిన కోటంరెడ్డిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
టీడీపీలోకి వెళ్లేందుకు ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్, ఇంటెలిజెన్స్ చీఫ్‌పై ఆయన ఆరోపణలు చేశారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు కోటంరెడ్డిపై విమర్శలకు దిగారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. అది రికార్డింగ్ మాత్రమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మీడియా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ నేతలు చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులివ్వనున్నట్లు తెలుస్తోంది.