హైదరాబాద్: నగరంలో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మంచి ఫలితాలనే అందించింది. కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు కొవాగ్జిన్ మెరుగ్గా పని చేస్తుందని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు 18-98 ఏళ్ల వయసు గల మొత్తం 25,800 మందికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, ఈ ట్రయల్స్‌లో టీకా సామర్థ్యం 80.6 శాతంగా నమోదైందని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఫలితాల వివరాలను బుధవారం వెల్లడించింది.
25,800 మంది వలంటీర్లపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం దేశంలోనే మొదటిసారి అని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. మూడో దశలో మొత్తం వలంటీర్లు 2,433 ఉన్నారని, వీరంతా 60 ఏళ్లకు పైబడిన వారున్నారన్నారు. మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌తో పోలిస్తే.. మూడో దశలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. కొవాగ్జిన్ టీకాను వలంటీర్లకు వేసినప్పుడు వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఆరోగ్య సమస్యలు తలెత్తలేదన్నారు.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో కొవాగ్జిన్ 80.6 శాతం మెరుగైన ఫలితాలను అందించింది. ఇది చరిత్రాత్మకమైన రోజుగా భావించవచ్చని భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. కరోనా కొత్త ఉత్పరివర్తనమైన స్ట్రెయిన్‌ను కూడా తగ్గిస్తుందని, కొవాగ్జిన్ టీకా వేయించుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుందన్నారు. కాగా, సీరమ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తీసుకొచ్చిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్థ్యం కేవలం 70 శాతం మాత్రమే ఉందని ఆ సంస్థ వెల్లడించింది.
వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సమయంలో కొందరు వలంటీర్లను తీసుకున్నారు. వీరిలో కొందరికీ కొవాగ్జిన్ టీకాలు అందించారు. మరికొందరికి కేవలం గ్లూకోజ్ లాంటి టీకాను ఇంజెక్ట్ చేసి పరిశీలించారు. కొవాగ్జిన్ టీకా వేసుకున్న వారిలో యాంటీబాడీస్ ఉత్పత్తయినట్లు డాక్టర్లు గుర్తించారు. అత్యవసర వినియోగం పేరుతో పలు సంస్థలు తమ టీకాను అభివృద్ధి చేసి మార్కెట్‌లో తీసుకొస్తున్నాయి. ఈ తరుణంలో భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూనే.. టీకా సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది.