ఔషధ రంగంలో ప్రపంచంలోనే ముందంజలో ఉన్న భారత్.. జనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దావోస్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ప్రసంగించారు. బయోటెక్నాలజీ, డేటా సైన్స్ వినియోగం వల్ల రోగులకు సేవలందించడం సులభతరమైందన్నారు.
బయోటెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులు… ఆహారం, ఔషధాలు, సంబంధిత వస్తువుల తయారీకి ఎంతో దోహదపడుతోందని తెలిపారు. సాంకేతికతను అన్ని రంగాలకు విస్తరించడంలో తెలంగాణ ముందుందని మంత్రి వెల్లడించారు. కోవిడ్ టీకాను భారత్ బయోటెక్ ఆవిష్కరించిందని, క్రమంగా ఇతర కంపెనీలు సాంకేతికతను అందిపుచ్చుకొని కోవిడ్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చాయని కేటీఆర్ వివరించారు.