కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమించాలి

-

కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే కేసీఆర్(KCR) కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ స‌మక్షంలో సింగ‌రేణి బీఎంఎస్ అధ్య‌క్షుడు కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… విపక్షనేతలపై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ /KCR

తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ వచ్చిందని బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేసారు. బండి సంజయ్ తన పాదయాత్రలో ప్రతి ఊరులో బీజేపీ పాలిత రాష్ట్రానికి తెలంగాణకు ఉన్న తేడా చూడాలి, చెప్పాలని… అలానే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న పథకాలు ఎందుకు లేవో కూడా చెప్పాలని డిమాండ్ చేసారు. తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చిందో కూడా వివరించాలన్నారు. ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా కేంద్రం తెలంగాణకు ఇచ్చిందా? అని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణ పథకాలను కాపీ కొడుతోందని ఆరోపించారు. కేసీఆర్ నాలుగు రోజులు బయట తిరుగుతే అందరి నోర్లు మూతపడ్డాయని అన్నారు.

నిన్న మొన్నా పదవులు వచ్చిన వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌ను తిడితే గొప్పోళ్ళు కాలేరని, తెలంగాణలో కేసీఆర్‌ను గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు సీఎంలు ఉంటారేమే కానీ తెలంగాణకు రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నాడని అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే డైలాగ్స్ కొడితే సరిపోదన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అన్న రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ బలిదేవత సోనియాగాంధీ అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేసారు. రేవంత్ రెడ్డి పార్టీ మారడం గురించి మాట్లాడితే ప్రజలు కొడుతారని అన్నారు. గతంలో టీడీపీలో గెలిచిన రేవంత్ రెడ్డి రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. ఉన్నతమైన పదవులు వస్తే ఉన్నతంగా పని చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version