తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన నిమిత్తం నేడు లండన్ బయలుదేరనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి పర్యటన సాగనుంది. లండన్‌లో పలు కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
అనంతరం అక్కడి నుంచి స్విట్జర్లాండ్ చేరుకుంటారు మంత్రి కేటీఆర్. దావోస్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు మంత్రి కేటీఆర్. ఆ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల అధినేతలు, సీఈవోలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించి రాష్ట్రానికి మంత్రి కేటీఆర్ ఆహ్వానిస్తారు. అనంతరం ఈ నెల 26న మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.