అమిత్ షా…బండి…మధ్యలో చెప్పులు..!

-

అధిష్టానానికి ఏ నాయకుడైన విధేయుడే..ఆ విధేయతకు ఓ పరిధి ఉంటే పర్లేదు…ఆ పరిధి దాటినప్పుడే కాస్త ఇబ్బందులు వస్తాయి. ఎవరైనా సరే అధినేతలని ప్రసన్నం చేసుకుంటే పదవులు వస్తాయని చెప్పి..అధినేతలకు లేనిపోని సేవలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సేవల వల్ల పదవులు వస్తాయేమో గాని…ప్రజల్లో ఆదరణ పెరగదని చెప్పొచ్చు. కానీ నేటి రాజకీయంలో చిన్న విషయాన్ని కూడా బూతద్ధంలో పెట్టి ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఆ జాగ్రత్త లేకపోవడం వల్లే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ టార్గెట్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది…ఇంకా దూకుడుగా ముందుకెళుతుంది. అయితే ఈటల రాజేందర్ రాకతో బండికి ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం పెరిగింది…అయితే ఇదంతా ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారం. ఈ ప్రచార క్రమంలోనే బండి..తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాకు చెప్పులుఅందించడం పెద్ద హాట్ టాపిక్ అయింది. తాజాగా రాష్ట్రానికి వచ్చిన షా..సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. షాతో పాటు బండి సంజయ్ కూడా ఉన్నారు.

మహంకాళి అమ్మవారిని దర్శించుకుని కేంద్ర మంత్రి అమిత్ షా బయటకు రాగానే, ఆయనతో పాటు బయటకు వచ్చిన బండి సంజయ్ అమిత్ షా చెప్పులను చేతులతో తెచ్చి అమిత్ షా కాళ్ళ ముందు పెట్టారు. ఇక ఈ వీడియో ఫుల్ గా వైరల్ అయిపోయింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బండిపై సెటైర్లు వేస్తున్నారు. “ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న  నాయకున్ని –  తెలంగాణ  రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది”. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

అటు “తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని, బీజేపీ లో బీసీ నేత స్థానం ఏంటో చూడండి. తెలుగు వారి ఆత్మగౌరవం ఇదేనా?.. అమిత్ షా చెప్పులు మోయడమేంటి’’ అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఇలా పలువురు నేతలు బండిపై విమర్శలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ మెప్పు పొందడానికి ఎవరు ఏం చేశారో తమకు తెలుసని, పెద్దలకు గౌరవం ఇచ్చిన తమ నేత బండిపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని బీజేపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version