అమరావతి రాజధాని ప్రాంతంలో ఈరోజు ఇద్దరు రైతులు మరణించారు. మొత్తం మీద ఇప్పటికి 92 మంది రైతులు అమరావతి కోసం అసువులు బాశారు. అలానే అక్కడి రైతులు మొదలు పెట్టిన అమరావతి ఉద్యమం ఈనెల 12వ తేదీకి 300 రోజులకు చేరుతోంది కూడా. ఈ సంధర్భంగా వారికి మద్దతుగా నిలిచారు టిడిపి నేత కూన రవి కుమార్. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారని టిడిపి నేత కూన రవి కుమార్ అన్నారు.
వాళ్ళంతా జగన్ నిరంకుసత్వానికి బలయ్యారని అయన అన్నారు. అప్పట్లో దారుణాలు చేసిన తుగ్లక్ చరిత్రను జగన్ తిరగ రాశారని ఆయన ఎద్దేవా చేశారు. ఓటేసిన పాపానికి అమరావతి రైతులను ఏకే 47 గన్ తో కాలుస్తున్నరని ఆయన అన్నారు. అమరావతిలో 56 శాతం దళిత, బీసీ కులాల వారే నివాసముంటున్నారని పేర్కొన్న రవి కుమార్ అలాంటి అమరావతిని కమ్మరాజధాని అనటం విడ్డూరమని అన్నారు. జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వంతో అమరావతితో మూడు ముక్కలాట మొదలుపెట్టారన్న ఆయన రైతులపై విమర్శలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు. అమరావతి రైతుల దీక్షకు సంఘీభావంగా రేపు కాగడాల ప్రదర్శన నిర్వహిస్తామని రవి కుమార్ పేర్కొన్నాడు.