అసలే వరదలు కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. ఈ సమయంలోనే నెలలు నిండిన ఒక గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఇక ఆ వరదల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. వివరాల్లోకి వెళ్తే భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లా కొల్లూరు నుండి ఆ మండలంలోని లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈపూరు లంక గ్రామంలో ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడం, ఆమె నొప్పితో బాధపడుతున్న క్రమంలో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే లంక నుండి కొల్లూరుకు రాక పోకలు బంద్ కావడంతో ఎస్‌ఐకి సమాచారం అందించారు. ఎస్‌ఐ అక్కడికి వెళ్లే లోపే గర్భిణీ వరద నీటిలోనే డెలీవరీ అయింది. అనంతరం అక్కడికి వెళ్ళిన ఎస్ఐ స్థానికుల సహాయంతో ఒక తాడు కట్టి ఆ తాడుని బేస్ చేసుకుని ఒక మంచంపై తల్లీ, బిడ్డను బయటకు తీసుకొచ్చారు. అనంతరం108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ ఎస్సై సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.