తాజా రిపోర్ట్: మేలో అత్యధికంగా పెరగనున్న కరోనా కేసులు.. పరిశోధకుల వెల్లడి..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3.32 లక్షల కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 24,28,616 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల తీవ్రతపై తాజాగా ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. ఇందులో మే నెల 11-15వ తేదీ మధ్యలో దాదాపు 10 లక్షలకుపైగా కరోనా కేసులు పెరుగుతాయని అంచనా వేశారు. మళ్లీ మే చివరి నాటికీ కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. అప్పటివరకు దేశంలో మొత్తంగా 33 నుంచి 35 లక్షల వరకు కరోనా కేసులు ఉండవచ్చని అంచనా వేశారు.

కరోనా పరీక్షలు
కరోనా పరీక్షలు

మే 11-15వ తేదీ మధ్యలో అండర్ ట్రైనింగ్ రోగుల సంఖ్య పెరగడానికి తాత్కాలిక కారణం ఉందని, 33-35 లక్షల వరకు కరోనా కేసులు ఉంటాయని ఐఐటీ కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ మనీందర్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, రోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ కొరత, కొత్త కేసుల నమోదు కొద్ది రోజులపాటు ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. మే చివరి నాటి కేసుల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఏప్రిల్ 25-30వ తేదీ వరకు దేశంలోని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతేడాది కనిపించిన లక్షణాల కంటే.. ఈ ఏడాది కనిపిస్తున్న లక్షణాలు భిన్నంగా ఉన్నాయని, ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా.. బాధితులు వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు తెలిపారు.

అయితే ఈ నెలలో 15వ తేదీ వరకు కరోనా కేసులు తారాస్థాయికి చేరుతాయని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ, వారి పరిశోధన విఫలమైంది. ఈ విషయంపై ప్రొఫెసర్ అగర్వాల్ మాట్లాడుతూ.. కేసులు తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వైరస్ అంచనా వేయడానికి 3 స్టేజీల ఆధారంగా రిపోర్టు తయారు చేస్తామన్నారు. ఒక వ్యక్తికి కరోనా సోకి అతను ఎంత మందితో కలుస్తాడు.. ఎంత మందితో మాట్లాడుతాడు.. అనే సమాచారాన్ని తీసుకుని నివేదిస్తామన్నారు. రెండవది కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో.. ఆ ప్రాంత జనాభాను బట్టి పరిశోధన జరుపుతామని, మూడవది ధ్రువీకరించబడిన కేసుల ఆధారంగా రిపోర్టులు తయారు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.