దేశీయ మొబైల్స్ తయారీదారు లావా.. ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేకుండానే ఇతర వ్యక్తులకు నగదు పంపించుకునేలా లావా పే పేరిట ఓ నూతన పేమెంట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు గురువారం ఈ యాప్‌ను లాంచ్ చేశారు. అయితే ఈ యాప్ కేవలం లావా ఫీచర్ ఫోన్లలోనే పనిచేస్తుంది.
లావా ఫీచర్ ఫోన్లలో లావా పే యాప్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. ఇక ఇప్పటికే లావా ఫీచర్ ఫోన్లను వాడేవారు ఈ యాప్ కావాలనుకుంటే తమకు సమీపంలోని లావా మొబైల్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఫోన్‌లో వినియోగదారులు తమ యూపీఐ ఐడీ, అవతలి వారి ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేశాక పంపాలనుకున్న నగదును ఎంటర్ చేసి, పిన్ నంబర్ తో ట్రాన్సాక్షన్ చేయాలి. దీంతో అవతలి వారికి నగదు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ క్రమంలో నగదు బదిలీ అయినట్లు వినియోగదారుడికి, అవతలి వారికి మెసేజ్‌లు వస్తాయి.
ఇక ఇప్పటికే యూపీఐ ఐడీ లేని వారు కూడా ఈ యాప్ సహాయంతో కొత్తగా యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. అందుకు గాను వారు తమకు సమీపంలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కాగా ఈ యాప్‌కు ఇంటర్నెట్ అవసరం ఉండదని లావా మొబైల్స్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలు ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయానికి నోచుకోలేదని, అలాంటి ప్రాంతాల్లోని వారికి లావా పే యాప్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.