మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) విచారణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఫాంహౌజ్‌లో పట్టుబడిన వారితో పాటు మరో నలుగురిని నిందితుల జాబితాలో చేర్చింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరికీ నోటీసులు జారీచేస్తూ లోతుగా దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే న్యాయవాది శ్రీనివాస్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. ఆయన గత రెండ్రోజులుగా సిట్ వద్ద విచారణకు హాజరయ్యారు.
ఇవాళ కూడా సిట్ విచారణకు రావాల్సిన న్యాయవాది శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. న్యాయవాది శ్రీనివాస్ ముక్కుకు శస్త్రచికిత్స జరిగటంతో… ఆస్పత్రిలో ఉన్నందున సిట్ ఎదుట హాజరుకాలేనని సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
ఈ కేసులో నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖ సిట్ ముందుకొచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన తాఖీదుల మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వీరు చేరుకున్నారు. న్యాయవాది ప్రతాప్‌గౌడ. నందకుమార్‌తో పలు లావాదేవీలు నిర్వహించడంతో పాటు ఇద్దరూ కలిసి ప్రయాణాలు సాగించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నందకుమార్, రాంచంద్రభారతి మొబైల్ ఫోన్లలో డేటా సేకరించారు. వీరితో ప్రతాప్‌గౌడ్‌కున్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది.